ఆంక్షలు ఉపసంహరించుకోక పొతే తీవ్ర పరిణామాలు: చైనా

వాస్తవం ప్రతినిధి: రష్యాతో సైనిక సహకారానికి సంబంధించి తమపై తాజాగా విధించిన ఆంక్షలను వెంటనే ఉపసంహరించుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వుంటుందని డ్రాగన్ చైనా అమెరికాను మరోసారి హెచ్చరించింది. అమెరికా తను చేస్తున్న తప్పులను వెంటనే సరిదిద్దుకోవాలని లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చైనా హెచ్చరించింది. రష్యాతో యుద్ధ విమానాలు, క్షిపణుల కొనుగోలుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చైనాపై ఆంక్షలు విధించిన ట్రంప్‌ సర్కారు మీడియా సంస్థలపై కూడా తన ప్రతాపం చూపెట్టింది. తమ దేశంలోని సిన్హువా, సిజిటిఎన్‌ నెట్‌వర్క్‌లను నాజీ కాలం నాటి విదేశీ ఏజెంట్ల చట్టం కింద నమోదు చేయాలని హుకుం జారీ చేసింది. ఇదిలా వుండగా రష్యా నుండి యుద్ధ విమానాలు, క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేశారన్న సాకుతో అమెరికాలోని ట్రంప్‌ సర్కారు చైనాకు చెందిన ఒక సైనిక సంస్థపై గురువారం ఆంక్షలు విధించింది. తాము రష్యాపై విధించిన ఆంక్షలను ఉల్లంఘించిన చైనా సంస్థపై కూడా ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా విదేశాంగశాఖ అధికారి ఒకరు గురువారం మీడియాకు చెప్పారు. చైనాకు చెందిన ఎక్విప్‌మెంట్‌ డెవలప్‌ మెంట్‌ డిపార్ట్‌ మెంట్‌ (ఇడిడి), దాని డైరెక్టర్‌ లీ షాంగ్ఫుపై విధించిన ఈ ఆంక్షలు వెంటనే అమలులోకి వచ్చాయని అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది.