ఆ డీల్ పై మాకు ఎలాంటి సంబంధం లేదు: ఫ్రాన్స్ ప్రభుత్వం  

వాస్తవం ప్రతినిధి: రాఫెల్ యుద్ద విమానాల డీల్ పై రోజుకో సంచలన విషయాలు వెల్లడౌతున్నాయి. ప్రధాని మోదీ చేసిన సూచన మేరకు తాము రాఫెల్ డీల్‌ను రిలయన్స్ కంపెనీకి ఇచ్చినట్లు ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిజ్ హోలాండే తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆ అంశంపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా రభస మొదలైంది. అయితే ఆ వివాదానికి తమకు సంబంధం లేదని తాజాగా ఫ్రాన్స్ ప్రభుత్వం వెల్లడించింది. శుక్రవారమే ఫ్రెంచ్ ప్రభుత్వ ఒక ప్రకటనను జారీ చేసింది,ఆ ప్రకటనలో రాఫెల్ ఫైటర్ జెట్ ఒప్పందంలో భారతీయ కంపెనీ భాగస్వామ్యంపై తమ ప్రమేయం ఏమీలేదని ఆ ప్రకటనలో పేర్కొంది. డసాల్ట్ ఏవియేషన్ సంస్థతో అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుందని, రాఫెల్ యుద్ధ విమానాల కోసం ఆ ఇద్దరి మధ్య 58 వేల కోట్ల ఒప్పందం కుదిరినట్లు తెలుస్తుంది. అయితే భారత పరిశ్రమ ఎంపిక విషయంలో ఫ్రాన్స్ పాత్ర లేదని ఆ ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే రిలయన్స్ కంపెనీనే ఎందుకు ఎంపిక చేశారన్న అంశంపై మాత్రం హోలాండే స్పష్టమైన వివరణ ఇవ్వలేదు. కానీ మేక్ ఇన్ ఇండియాలో భాగంగా రిలయన్స్ డిఫెన్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు డసాల్ట్ ఏవియేషన్ ఓ ప్రకటనలో పేర్కొన్నది. డసాల్ట్‌తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారమే రాఫెల్ యుద్ధ విమానాల తయారీ కోసం నాగపూర్‌లో రిలయన్స్ సహకారంతో ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించినట్లు డసాల్ట్ తన ప్రకటనలో తెలిపింది. రాఫెల్ కోనుగోలు విషయంలో భారీ అవకతవకలు జరిగినట్లు కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.