ఆసక్తికరంగా సాగిన పాక్-ఆఫ్ఘన్ మ్యాచ్….పాక్ విజయం

వాస్తవం ప్రతినిధి: ఆసియాకప్‌లో పాక్-ఆఫ్ఘనిస్తాన్ ల మధ్య శుక్రవారం ఆసక్తికర పోరు జరిగింది. ఉత్కంఠభరితంగా జరిగిన ఈ పోరులో పాకిస్థాన్‌ 3 వికెట్ల తేడాతో ఆఫ్ఘన్ పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన అఫ్గానిస్థాన్‌ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. అఫ్గాన్‌ ఇన్నింగ్స్‌లో హస్మతుల్లా షాహిది(97: 118 బంతుల్లో), కెప్టెన్‌ అస్గర్‌ అఫ్గాన్‌(67: 56 బంతుల్లో) అర్ధశతకాలతో రాణించారు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన పాక్‌ 49.3 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. పాక్‌ ఇన్నింగ్స్‌లో ఇమామ్‌ ఉల్‌ హక్‌(80: 104 బంతుల్లో), బాబర్‌ అజామ్‌(66: 94 బంతుల్లో) అర్ధశతకాలతో రాణించారు. గత రెండు మ్యాచ్‌ల్లో నెగ్గి మంచి ఊపుమీదున్న పసికూన అఫ్గాన్‌ను పాక్‌ నిలువరించింది. విజయం కోసం రెండు జట్లు తీవ్రంగా శ్రమించాయి. పాక్‌ బౌలర్లలో మహ్మద్‌ నవాజ్‌ 3 వికెట్లు తీయగా, షాహిన్‌ ఆఫ్రిది (2), హసన్‌ అలీ ఒక వికెట్‌ తీశాడు. అఫ్గాన్‌ బౌలర్లలో రషీద్‌ ఖాన్‌(3), ముజీబ్ ఉర్‌ రహ్మన్‌(2), గుల్‌బదిన్‌ నయబ్‌ ఒక వికెట్‌ తీశాడు. షోయబ్ మాలిక్‌‌ అర్ధసెంచరీ(51: 43 బంతుల్లో)తో రాణించి పాక్‌ను గెలిపించాడు. దీనితో ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా పాక్‌ బ్యాట్స్‌మెన్‌ షోయబ్‌ మాలిక్‌ నిలిచాడు.