బంగ్లా పై విరుచుకుపడ్డ భారత్…ఘన విజయం

వాస్తవం ప్రతినిధి: ఆసియా కప్‌లో భాగంగా శుక్రవారం భారత్-బంగ్లా దేశ్ ల మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో తాత్కాలిక టీమిండియా సారధి రోహిత్‌ శర్మ (83 నాటౌట్‌; 104 బంతుల్లో 5×4, 3×6) కనువిందు చేశాడు. తన సొగసరి బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. అర్ధశతకంతో అదరగొట్టాడు. అతడికి తోడుగా శిఖర్ ధావన్‌ విజృంభించడంతో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి సూపర్‌-4 మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ప్రత్యర్థి నిర్దేశించిన 174 పరుగుల లక్ష్యాన్ని 7 వికెట్ల తేడాతో ఛేదించింది. ఇంకా 13.4 ఓవర్లు మిగిలి ఉండగానే భారత్‌ విజయ తీరాలను చేరింది. మాజీ సారథి ఎంఎస్‌ ధోనీ (33; 37 బంతుల్లో 3×4) రోహిత్‌కు తోడుగా నిలిచాడు. అంతకు ముందు జడేజా (4), భువి (3), బుమ్రా (3) బంగ్లా నడ్డి విరిచారు. మెహది హసన్‌ (42; 50 బంతుల్లో 2×4, 2×6), మొర్తజా (26; 32 బంతుల్లో 2×4), మహ్మదుల్లా (25; 51 బంతుల్లో 3×4) ఫర్వాలేదనిపించారు.