చైనా ఓపెన్ లో భారత్ పోరు ముగిసింది

వాస్తవం ప్రతినిధి:  చైనా ఓపెన్‌ బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌ 1000 బ్యాడ్మింటన్‌ టోర్నీలో మొత్తానికి భారత్‌ పోరాటం ముగిసింది. అగ్రశ్రేణి క్రీడాకారులు పి.వి.సింధు, కిదాంబి శ్రీకాంత్‌లకు క్వార్టర్‌ఫైనల్లో చుక్కెదురైంది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ పోరులో మూడో సీడ్‌ సింధు 11-21, 21-11, 15-21తో ఐదో సీడ్‌ చెన్‌ (చైనా) చేతిలో పోరాడి ఓడిపోయింది. మరోపక్క  పురుషుల సింగిల్స్‌లో ఏడో సీడ్‌ శ్రీకాంత్‌ 9-21, 11-21తో మూడో సీడ్‌ కెంటొ మొమొట (జపాన్‌) చేతిలో చిత్తయ్యాడు. కేవలం 28 నిమిషాల్లో నే ఈ మ్యాచ్ ముగియడం గమనార్హం. వీరిద్దరు 11 సార్లు తలపడగా.. ఎనిమిదింట్లో మొమొట, మూడింట్లో శ్రీకాంత్‌ గెలిచారు. గత ఐదు సార్లు శ్రీకాంత్‌పై మొమొట పైచేయి సాధిస్తూనే ఉన్నాడు.