అసోం లో ఘోర ప్రమాదం….చెరువులో తెగిపడ్డ విద్యుత్ వైరు

వాస్తవం ప్రతినిధి: అసోంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హైటెన్షన్‌ విద్యుత్‌ వైరు చెరువులో తెగిపడటంతో 10 ఏళ్ల బాలుడితో సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ ఘటనలో మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన శుక్రవారం నగాన్‌ జిల్లా ఉత్తర్‌ ఖాటూల్‌లో చోటుచేసుకుంది. గ్రామంలోని చెరువులో 11 కేవీ హైటెన్షన్‌ వైరు తెగిపడటం గుర్తించిన గ్రామస్తులు విద్యుత్‌ అధికారులకు సమాచారమిచ్చారు. అయితే విధ్యుత్ అధికారులు తీగలో విద్యుత్‌ ప్రసారం లేదని చెప్పడంతో గ్రామస్తులు చేపలు పట్టడానికి అని చెరువులోకి దిగారు. కానీ అకస్మాత్తుగా విద్యుత్‌ ప్రసారం కావడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, 8 మంది గాయపడినట్లు తెలుస్తుంది. అయితే ఈ ఘటనతో ఆగ్రహించిన స్థానికులు ఆ ప్రాంతంలోని విద్యుత్‌ కార్యాలయంపై దాడి చేసి ఫర్నీచర్, వాహనాన్ని ధ్వంసం చేసినట్లు తెలుస్తుంది.