యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ లో దోపిడి దొంగలు బీభత్సం

వాస్తవం ప్రతినిధి: యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైల్లో దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. ఈ రోజు తెల్లవారుజామున 4గంటల సమయంలో బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ దాటిన తర్వాత దివిటిపల్లి వద్ద దోపిడీ దొంగలు సిగ్నల్ కట్ చేయడంతో రైలు ఆగిపోయింది. వెంటనే ఒక్కసారిగా దోపిడీకి పాల్పడ్డారు.రాళ్లతో దాడి చేయడంతో ప్రయాణికులు ఎం జరుగుతుందో తెలుసుకునేందుకు కిటికి తలుపులు తెరవడంతో అందిన కాడికి దోచుకున్నారు.
మహిళల వద్ద నుంచి బంగారం, బ్యాగ్‌లలో ఉండే విలువైన వస్తువులను అపహరించారు. దాదాపు 24 తులాల బంగారం, 4సెల్‌ఫోన్లను దొంగలు తీసుకెళ్లినట్లు సమాచారం. ప్రతిఘటించిన ప్రయాణికులపై వారు దాడి చేయడంతో పలువురికి గాయాలు అయ్యాయి. ఘటన అనంతరం ఈ ఉదయం కాచిగూడకు చేరుకున్న బాధితులు అక్కడి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును చేస్తున్నట్లు వెల్లడించారు.