రాఫెల్ విషయంగా మరోసారి మోదీ పై తీవ్ర విమర్శలు చేసిన రాహుల్

వాస్తవం ప్రతినిధి: రాఫెల్ యుద్ద విమానాల కొనుగోలు లో భారీ కుంభకోణం జరిగింది అంటూ కాంగ్రెస్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు ఇటీవల ఈ ఒప్పందం పై సంచలన విషయాలు వెల్లడవ్వడం తో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో ప్రధాని మోదీ పై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. రాఫెల్ కుంభకోణంలో అనిల్ అంబానీకి ప్రధాని నరేంద్ర మోడీ రూ.30 వేల కోట్ల బహుమానం ఇచ్చారని రాహుల్ ఆరోపించారు. శనివారం రాహుల్ మీడియాతో మాట్లాడారు. ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు భారత ప్రధానిని దొంగ అంటున్నారని, ఫ్రాన్స్ ప్రధాని చెప్పింది నిజమా? అబద్ధమా? అని ప్రశ్నించారు. రాఫెల్ శ్కాం పై ప్రధాని మోదీ నోట్లోంచి ఒక్క మాట కూడా ఎందుకు రావడం లేదని రాహుల్ నిలదీశారు. రాఫెల్ 30 వేల కోట్ల రూపాయలు కుంభకోణమ‌ని రాహుల్ మండిపడ్డారు.