ఈ నెల 25 నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్న పవన్ కల్యాణ్

వాస్తవం ప్రతినిధి: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ ఈ నెల 25 నుంచి పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన మొదలు కానుంది. ఈ మేరకు హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో పర్యటన కార్యక్రమాలపై రాజకీయ వ్యవహారాల కమిటీ (ప్యాక్), జిల్లా సమన్వయకర్తలు, సంయుక్త సమన్వయ కర్తలతో పవన్ కల్యాణ్‌ చర్చించి ప్రణాళిక ఖరారు చేశారు.

జనసేన పోరాటయాత్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని మిగిలిన ఏడు నియోజకవర్గాల్లో పవన్ కల్యాణ్‌ పర్యటిస్తారు. ఈ పర్యటన 25వ తేదీన ఏలూరులో మొదలవుతుంది. ఈ పర్యటనలో భాగంగా పోలవరం ప్రాజెక్ట్ ను సందర్శించి, అక్కడి పనులను పరిశీలిస్తారు. పోలవరం నిర్వాసితుల సమస్యలపై చర్చిస్తారు.

నిర్వాసితులకు పునరావాసం, పరిహారం అందించిన తీరు, వాళ్ళ బాధలపై నేరుగా వారితోనే మాట్లాడతారు. ముంపు మండలాల్లోని గ్రామాలకు వెళ్తారు. అక్కడి సమస్యలను నేరుగా పరిశీలిస్తారు. అన్ని నియోజకవర్గాల్లోని సమస్యలపై సంబంధిత వర్గాలతో పవన్ కల్యాణ్‌ చర్చిస్తారు. పశ్చిమ గోదావరి పర్యటన తరవాత తూర్పు గోదావరి జిల్లాలోకి పవన్ కల్యాణ్‌ అడుగు పెడతారు. తూర్పు గోదావరికి చేరే వరకూ ఏకబిగిన పర్యటన సాగుతుంది.

మరోవైపు ప్రసిద్ధిగాంచిన నెల్లూరు రొట్టెల పండుగలో పాల్గొనేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ ఈ నెల 23న నెల్లూరు పర్యటన ఖరారైంది. బారా షహీద్ దర్గాను సందర్శించి ప్రార్ధనలు చేయనున్నారు.