ఆసియా కప్ లో బోణీ కొట్టిన బంగ్లా…..ఒంటి చేత్తో బ్యాటింగ్ చేసిన తమీమ్

వాస్తవం ప్రతినిధి: ఆసియా కప్‌లో బంగ్లాదేశ్‌ బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌లో శ్రీలంకపై 137 పరుగుల తేడాతో ఘన విజయం సాధించినట్లు తెలుస్తుంది. తన అద్భుత ఇన్నింగ్స్‌తో బంగ్లాకు అనూహ్యమైన స్కోరును అందించిన వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ ముష్ఫికర్‌ రహీమ్‌ (144: 150 బంతుల్లో 11×4, 4×6) గురించే కాకుండా ఇప్పుడు మరో బ్యాట్స్‌మన్‌ గురించి అందరూ చర్చించుకుంటున్నారు, అతను ఎవరో కాదు బంగ్లా బ్యాట్స్ మెన్ తమీమ్‌ ఇక్బాల్. ‌గాయం కారణంగా రిటైర్‌ హర్ట్‌గా వెనుదిరిగి.. తిరిగి చివర్లో క్రీజులోకి వచ్చి ఒంటి చేత్తో బ్యాటింగ్‌ చేసి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాడు. అతని ప్రదర్శనపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

బంగ్లా ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లోనే ఇద్దరు బ్యాట్స్‌మెన్లు లిటన్‌ దాస్‌, షకీబ్‌ డకౌట్‌గా వెనుదిరిగారు. తర్వాత రెండో ఓవర్‌లో లక్మల్‌ బౌలింగ్‌లో ఓపెనర్‌ తమీమ్‌ ఇక్బాల్‌ ఎడమ చేతి మణికట్టుకు బంతి బలంగా తాకడంతో గాయం కారణంగా రిటైర్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. లంక బౌలర్ల ధాటికి ఆ తర్వాత పరుగులు రావడం కష్టంగా మారింది. పది ఓవర్లకు ఆ జట్టు స్కోరు 24 పరుగులే. అనంతరం ముష్ఫికర్‌, మిథున్‌ చెలరేగి ఆడారు. 123 బంతుల్లో శతకం పూర్తి చేసిన రహీమ్‌కు.. మరో ఎండ్‌ నుంచి ఆశించిన సహకారం లభించలేదు. బంగ్లా 9వ వికెట్‌ చేజార్చుకున్న అనంతరం తిరిగి గాయంతోనే తమీమ్‌ ఇక్బాల్‌ 47వ ఓవర్‌లో క్రీజ్‌లోకి వచ్చాడు. గాయంతో బాధపడుతున్నప్పటికీ.. ఒంటి చేత్తోనే బ్యాటింగ్‌ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇందుకు సంబంధించిన వీడియో  సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో క్రికెట్‌ అభిమానులు అతని ధైర్యాన్ని మెచ్చుకుంటూ ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు.