తోపులాటలో తమిళ హీరో విజయ్ కి గాయాలు

వాస్తవం సినిమా: భారీగా వచ్చిన అభిమానుల మధ్య జరిగిన తోపులాటలో తమిళ హీరో విజయ్ కి గాయాలు అయ్యాయి. ఈ ఘటన పాండిచ్చేరిలో జరిగింది. విజయ్ ఆల్ ఇండియా ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, పాండిచ్చేరి మాజీ ఎమ్మెల్యే ఆనంద్ కుమార్తె వివాహం జరుగుతున్న వేళ, విజయ్ అక్కడికి వచ్చారు. ఈ పెళ్లికి వచ్చి, వధూవరులను విజయ్ ఆశీర్వదించనున్నారన్న విషయాన్ని ముందుగానే తెలుసుకున్న అభిమానులు, పెద్దఎత్తున కల్యాణ మండపానికి చేరుకున్నారు. విజయ్ కి స్వాగతం పలుకుతూ పోస్టర్లను, కటౌట్లను ఏర్పాటు చేశారు.

కల్యాణమండపంలోకి తన భార్య సంగీతతో కలసి విజయ్ వెళ్లగానే ఆయన్ను ఫ్యాన్స్ చుట్టుముట్టారు. చుట్టూ బౌన్సర్లున్నా, వారు అభిమానులను నియంత్రించలేకపోయారు. వధూవరులను ఆశీర్వదించేందుకు ఆయన బయలుదేరిన వేళ, అభిమానుల తోపులాటలో విజయ్ కిందపడిపోయాడు. ఆయన కాలికి దెబ్బ తగిలింది. అక్కడే బందోబస్తులో ఉన్న పోలీసులు తమ లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. ఆపై సంగీత, విజయ్ లను సురక్షితంగా అక్కడి నుంచి పంపించారు.