కేరళ ఆర్ధిక సాయం కి ఏపీ సి ఎం కి కృతఙ్ఞతలు తెలిపిన కేరళ సి ఎం  

వాస్తవం ప్రతినిధి: ఇటీవల భారీ వర్షాలు,వరదలు కారణంగా కేరళ రాష్ట్రం అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో పలు రాష్ట్రాలు కేరళకు ఆర్ధిక సాయాన్ని కూడా అందించాయి. ఈ క్రమంలో వరదలతో ఆపదలో చిక్కుకున్న కేరళను పెద్ద మనసుతో ఆదుకున్నారంటూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుకు.. కేరళ సీఎం పినరయి విజయన్‌ కృతజ్ఞతలు తెలిపినట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఆయన చంద్రబాబుకు ఒక లేఖ కూడా రాసినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరపున కేరళ సహాయనిధికి రూ.10కోట్లు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలు, వివిధ సంఘాల నుంచి కేరళకు రూ.40కోట్ల సాయం అందిందని లేఖలో పేర్కొన్నారు. తోటివారు ఆపదలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు పెద్ద మనసుతో స్పందించారని, సాటి భారతీయులుగా ఏపీ ప్రజల స్పందనకు గర్విస్తున్నామని పినరయి తెలిపారు.