ప్రణయ్ హత్య కేసులో కాంగ్రెస్ నేత అరెస్ట్

వాస్తవం ప్రతినిధి: సంచలనం సృష్టించిన పెరుమాళ్ల ప్రణయ్‌ హత్యకేసులో కాంగ్రెస్‌ నేత కరీం ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. కరీం తో పాటు ఐదుగురు నిందితులను అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రణయ్‌ భార్య అమృత తండ్రి మారుతీరావు, అతడి తమ్ముడు శ్రావణ్‌కుమార్‌, మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కరీంతో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రణయ్‌ను హత్య చేసిన నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. తన కుమార్తెను ప్రేమ వివాహం చేసుకున్నాడన్న కక్షతోనే ప్రణయ్‌ను మారుతీరావు హత్య చేయించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. కాంగ్రెస్‌ నేత కరీం విచారిస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రణయ్‌ని హత్య చేసేందుకు మారుతీరావు రూ.10లక్షలకు బేరం కుదుర్చుకున్నట్లు తమ విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.