సింహవాహన రూఢుడై భక్తులను అనుగ్రహించిన బ్రహ్మాండ నాయకుడు

వాస్తవం ప్రతినిధి: బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు తిరుమలలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల మూడో రోజు ఉదయం స్వామివారు సింహ వాహనంపై విహరించారు. దుష్టజన శిక్షణకు, శిష్టజన రక్షణకు సంకేతం సింహ వాహనం. జగన్నాయకుడి అవతారాల్లో నాలుగోది నృసింహ అవతారం. సింహ బలమంత భక్తిభావం కలిగి ఉన్నవారికి స్వామి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. శౌర్య ప్రతాపాలకు ప్రతీకగా నిలిచే సింహాన్ని తన వాహనంగా మలచుకుని తిరువీధులలో స్వామివారు విహరించారు. యోగ నృసింహునిగా సింహ వాహనంపై దర్శనమిచ్చిన స్వామివారిని చూసి భక్తులు పులకించిపోయారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు ఈరోజు రాత్రి ముత్యపు పందిరి వాహనంలో విహరించనున్నారు.

మరోవైపు శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా సెప్టెంబర్ 17న గరుడసేవ సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సెప్టెంబరు 16, 17వ తేదీల్లో దివ్యదర్శనం, సర్వదర్శనం టోకెన్లు జారీ చేయబడవని తిరుమల జేఈవో శ్రీ కెఎస్ శ్రీనివాసరాజు తెలియజేశారు. అదేవిధంగా సెప్టెంబరు 17న రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్లు ఇవ్వబడవన్నారు. `