బాబు ని తరిమి కొట్టినా కాంగ్రెస్ తోక పట్టుకొని మళ్లీ వస్తున్నాడు: ఎమ్మెల్సీ పల్లా  

వాస్తవం ప్రతినిధి: తెలంగాణా లో టీడీపీ పార్టీ ఒంటరి గా కాకుండా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో టీఆర్ ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పందించారు. తెలంగాణ నుంచి చంద్రబాబు నాయుడిని తరిమికొట్టినా కాంగ్రెస్ తోకపట్టుకుని మళ్లీ వస్తున్నాడని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన ఏపీ సీఎం చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. రాత్రికి రాత్రే ఏడు మండలాలను గుంజుకునేలా చంద్రబాబు చేశాడన్నారు. సీలేరు ప్రాజెక్టును కూడా అదేవిధంగా లాక్కున్నాడని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణలో జరిగిన ప్రతీ ఉప ఎన్నికలో చంద్రబాబు విచ్చలవిడిగా ఖర్చు చేసినా ఓటమి తప్పలేదని, ఎమ్మెల్యేను కొనబోయి అడ్డంగా దొరికిపోయాడని ఆయన గుర్తు చేశారు. తెలంగాణలో శాంతిభద్రతల రక్షణ కోసం గవర్నర్ చర్యలు తీసుకోవాలని కోరిన ఆయన ఇక్కడి నుంచి ఏపీ పోలీసులను అర్జెంటుగా తీసుకువెళ్లాల్సిందిగా పేర్కొన్నారు.