70 ఇళ్ళలో పేలిన గ్యాస్….ఆరుగురికి గాయాలు!

వాస్తవం ప్రతినిధి: అమెరికా లోని మస్సాచుసెట్స్‌ రాష్ట్రం మెర్రిమాక్‌ వ్యాలీలోని అండోవర్‌ పట్టణంలో గురువారం గ్యాస్‌ పేలుళ్లు సంభవించాయి. అయితే ఈ ఘటనలో ఆరుగురు గాయపడినట్లు తెలుస్తుంది. దీంతో ఆ ప్రాంతాన్ని అంతా అధికారులు ఖాళీ చేయించి మంటలను ఆర్పే ప్రయత్నం చేసారు అధికారులు. గ్యాస్‌ లైన్‌ లీకేజీ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చునని అధికారులు అనుమానిస్తున్నారు. సుమారు 10 ఇళ్ల నుంచి ఫైర్‌ అలారమ్‌లు మోగాయని, దీంతో వెంటనే 50 ఫైరింజన్లు, 10 అంబులెన్స్‌లు సంఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు స్థానిక అధికారులు తెలిపారు. అయితే సుమారు 70 ఇళ్లలో గ్యాస్‌ పేలుళ్లు సంభవించినట్లు తెలుస్తుండగా, 38 చోట్ల మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు అధికారులు వెల్లడించారు. తన కెరీర్‌లో ఇటువంటి సంఘటన ఎన్నడూ చూడలేదని, పట్టణంలో ఒక యుద్ధ భూమి వాతావరణం కనిపించిందని అగ్నిమాపక శాఖ అధికారి ఒకరు తెలిపారు.