ఆసీస్ తో వీలైనన్ని ఎక్కువ ప్రాక్టీస్ మ్యాచ్ లు ఆడుతాం: రవి శాస్త్రి

వాస్తవం ప్రతినిధి: ఆసీస్‌తో టెస్టు సిరీస్‌కు ముందు వీలైనన్ని ఎక్కువ ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు ఆడేలా చూడాలని బీసీసీఐని కోరనున్నట్లు టీమిండియా ప్రధాన కోచ్ రవి శాస్త్రి తెలిపాడు. ఆతిథ్య ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు ముందు భారత్‌ నాలుగు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడాల్సి ఉండగా దాన్ని ఒక రోజు తగ్గించి మూడు రోజుల పాటు మాత్రమే ఆడిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో కోహ్లీ సేన ఆ సిరీస్ ని 1-4 తో చేజార్చుకుంది. అలాగే ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికా పర్యటనలో టెస్టు సిరీస్‌కు ముందు ఒక్క ప్రాక్టీస్‌ మ్యాచ్‌ కూడా ఆడలేదు. దీంతో పలువురు మాజీ క్రికెటర్లు కోహ్లీ సేనపై విమర్శలు వ్యక్తం చేశారు. ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు ఆడితేనే టెస్టుల్లో అనుకూలమైన ఫలితాలు వస్తాయి. అలాంటిది ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు ఆడటంలో ఎందుకు అలసత్వం ప్రదర్శిస్తున్నారని వారు ఆరోపించారు. దీంతో రవిశాస్త్రి ఈ ఏడాది నవంబరులో ఆసీస్‌ పర్యటనకు వెళ్లిన సమయంలో వీలైనన్ని ఎక్కువ ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు ఆడేలా ప్లాన్‌ చేసుకుంటామని అన్నాడు.