లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం లో విభేదాలు….ఖండించిన తేజ్ ప్రతాప్!

వాస్తవం ప్రతినిధి: మొన్న ములాయం సింగ్ యాదవ్ కుటుంబంలో కలతలు వచ్చి ములాయం తమ్ముడు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసి సొంతగా పార్టీ పెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌యాదవ్‌ కుటుంబంలో కూడా విభేదాలు చోటుచేసుకున్నాయనే వార్తలు హాల్ చల్ చేస్తున్నాయి. అయితే ఆ వార్తలను ఆయన పెద్ద కుమారుడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ ఖండించారు. 2019 సాధారణ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన విధానాలపై చర్చించడానికి మంగళవారం బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి నివాసంలో జరిగిన పార్టీ సమావేశానికి తేజ్‌ ప్రతాప్‌ హాజరు కాలేదు. దీంతో తమ్ముడు తేజస్వీ యాదవ్‌తో విభేదాల కారణంగానే ఆయన సమావేశంలో పాల్గొనలేదని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై తేజ్‌ ప్రతాప్‌ స్పందిస్తూ.. తేజస్వీతో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. ఆ రోజు ఆరోగ్యం బాగాలేకపోవడం వల్లనే పార్టీ సమావేశానికి హాజరు కాలేదని తన తండ్రి ఉన్నంతకాలం తనను ఆర్జేడీ పార్టీ నుంచి ఎవరు తొలగించలేరని పేర్కొన్నారు.  తమ అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టడానికి బీజేపీ, ఆరెస్సెస్‌లతోపాటు తమ పార్టీలోని కొందరు నాయకులు కుట్రలు చేస్తున్నారని తేజ్‌ ప్రతాప్‌ విమర్శించారు.