చంద్రబాబుకు భారీ భద్రతా ఏర్పాట్లు

వాస్తవం ప్రతినిధి:  ఈ రోజు శ్రీశైలం పర్యటన సందర్భంలో ఏపీ సీఎం చంద్రబాబుకు కనీవినీ ఎరుగని రీతిలో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీశైలం రిజర్వాయర్‌ వద్ద ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం జలహారతి కార్యక్రమం నిర్వహిస్తోంది .ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు . పర్యటన లో భాగంగా శ్రీశైలం వెళ్లి శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిలను సి ఎం దర్శించుకుంటారు. అనంతరం జలాశయం వద్దకు చేరుకుని జలహారతి ఇవ్వనున్నారు. చివరిలో సున్నిపెంటలోని ప్రాజెక్టు ఉన్నత పాఠశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా అన్నిశాఖలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి. నల్లమలలో పోలీసులు మోహరించారు. సీఎం పర్యటించనున్న ప్రాంతాల్లో బాంబ్‌ స్క్వాడ్‌లు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నాయి.
బెల్జియం నుంచి తెప్పించుకున్న మెలినాయిస్ జాతి శునకం సేవలను బాంబ్ స్క్వాడ్ లో భాగంగా వినియోగించుకోనున్నారు. పేలుడు పదార్థాలను వెంటనే పసిగట్టడంలో గుర్తించగలదట ఈ కుక్క. ప్రస్తుతం నెల్లూరు జిల్లా పోలీసు ‘ సర్వీసు ‘ లో ఉందీ శునకం. శ్రీశైలంలో చంద్రబాబు దిగే హెలిపాడ్ వద్ద, ఆయన పర్యటించే ప్రాంతాల్లో ఈ జాగిలాన్ని వినియోగించుకుంటామని అధికారులు తెలిపారు. చురుకుగా ఉండడమే గాక, తక్కువ విశ్రాంతి తీసుకుని ఎక్కువ పని చేయడం దీని ప్రత్యేకతని వారు చెప్పారు. గత ఏప్రిల్ లో బెల్జియం నుంచి 8 శునకాలను తీసుకురాగా, వీటిలో ఒకదాని సేవలను బాబు భద్రత కోసం వాడుకోవడం ఇదే మొదటిసారి.