విమానంలో ఒకటికాదు రెండు కాదు ఏకంగా 20 పాములు!

వాస్తవం ప్రతినిధి: విమానం లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 20 పాములు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీనితో వారు విస్మయానికి గురయ్యారు. రష్యాలోని షెరెమెటివో అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులకు ఈ వింత అనుభవం ఎదురైంది. జర్మనీ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి సంచిలో ఏకంగా 20 పాములు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాటిని చిన్న చిన్న పెట్టెల్లో ఉంచి, వాటిని ఓ సంచిలో పేర్చి తీసుకొచ్చాడు. జర్మనీలో పాములు కొని వాటిని రష్యాకు తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. ‘‘పాములను కొన్నదానికి సంబంధించి అతడి వద్ద అన్ని పత్రాలు ఉన్నందువల్లే జర్మనీలోని డస్సల్‌డర్ఫ్‌ విమానాశ్రయంలో అధికారులు ఆపకపోయి ఉండొచ్చు. కానీ అక్కడి నుంచి పాములను రష్యాకు తెచ్చేందుకు ఎలాంటి అనుమతుల్లేవు’’ అని విమానాశ్రయ అధికారులు వివరించారు. అయితే మరోపక్క ఈ పాములు విషపూరితమైనవి కాదని ఆ వ్యక్తి తెలిపాడు. ఇలా పాములను ఓ చోట నుంచి మరో ప్రదేశానికి తీసుకెళ్లడం జర్మనీలో నేరం కాదని ఆ దేశానికి చెందిన పోలీసులు ఓ వార్తాసంస్థకు తెలిపారు. ప్రస్తుతం ఆ పాములు మాస్కోలో జంతు సంరక్షణ అధికారుల పర్యవేక్షణలో ఉన్నట్లు తెలుస్తుంది.