తొలిపూజ అందుకున్న ఖైరతాబాద్ సప్తముఖ కాలసర్ప మహాగణపతి

వాస్తవం ప్రతినిధి: వినాయక చవితి సందర్భంగా ఖైరతబాద్‌లో కొలువై ఉన్న భారీ గణనాథుడు తొలిపూజ అందుకున్నాడు. గురువారం ఉదయం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, స్వామి పరిపూర్ణనంద చేతుల మీదుగా మహాగణపతికి తొలిపూజ జరిగింది. ‘సప్తముఖ కాళసర్ప మహాగణపతి’గా ఖైరతాబాద్ గణనాథుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు. పదకొండు రోజుల పాటు స్వామివారు పూజలను అందుకోనున్నాడు. తొలిపూజ అనంతరం భక్తులకు మహాగణపతి దర్శనభాగ్యాన్ని కల్పించనున్నారు. మరోవైపు మహాగణనాథుడిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఖైరతాబాద్‌కు తరలివస్తున్నారు. భక్తులకు ఇబ్బంది కలుగకుండా గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగనున్న నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతను కల్పించారు.