విశాఖలో మిరాకిల్..ఇంటిపైనే పిడుగుపడినా ఆ చిన్నారికి ఏమీ కాలేదు

వాస్తవం ప్రతినిధి: అద్భుతం ఎప్పుడు ఎలా జరుగుతుందో ఊహించడం కష్టం. పిడుగు ఎంత ప్రమాదకరమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సాధారణంగా ఎక్కడైనా పిడుగు పడితే ఆ ప్రదేశమంతా మాడి మసైపోతుంది. కొన్ని వేల వోల్టుల విద్యుత్ శక్తి దానికి ఉంటుంది. అంత ప్రమాదకరమైన పిడుగు కూడా ఊయల్లో నిద్రిస్తున్న చిన్నారిని తాకలేకపోయింది. విశాఖపట్టణం జిల్లా సబ్బవరంలో జరిగిందీ అద్భుత ఘటన.
ఏడాదిన్నర తన కుమారుడ్ని ఊయలలో తల్లి నిద్రపుచ్చుతుండగా తమ ఇంటిపైనే పిడుగుపడినా ఆ చిన్నారికి ఏమీ కాలేదు. ఆ బుజ్జాయి తల్లికి కూడా కించిత్తు ప్రమాదం జరగకపోవడం విచిత్రం.
సబ్బవరంలోని సాయినగర్‌ కాలనీలో నక్క దేవప్రసాద్‌, సారూమ్‌ రోజా దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఏడాదిన్న వయసున్న బాబు వినయ్ రంజిత్ కూడా ఉన్నాడు.మంగళవారం సాయంత్రం రంజిత్ ఏడుస్తుంటే అతడిని నిద్రపుచ్చేందుకు చీరతో కట్టిన ఊయలలో పడుకోబెట్టి తల్లి నిద్రపుచ్చింది. అదే సమయంలో భారీ వర్షం పడడంతో ఓ పిడుగు వారి ఇంటి రేకుపై పడింది.
పిడుగు ధాటికి ఇంట్లోని ఎలక్ట్రానిక్ ఉపకరణాలు అన్నీ కాలిబూడిదయ్యాయి. ఇంట్లోని నేల కుంగిపోయింది. ఊయల కూడా కాలిపోయింది. అయితే, అదృష్టవశాత్తు ఊయలలో నిద్రపోతున్న చిన్నారికి ఏమీ కాలేదు. అంతేకాదు, ఊయల దగ్గరే ఉన్న రంజిత్ తల్లికి కూడా ఏమీ కాలేదు. విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. వారిని చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పిడుగు కూడా బాలుడిని ఏమీ చేయలేకపోయిందని, అతడు మృత్యుంజయుడని అంటున్నారు.