ఆఫ్ఘన్ లో ఆత్మాహుతి దాడి….22 మంది మృతి!

వాస్తవం ప్రతినిధి: ఆఫ్ఘనిస్తాన్‌లో మంగళవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో దాదాపు 22 మంది మరణించగా అనేక మందికి గాయాలు తగిలాయని అధికారులు చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్‌ తూర్పు ప్రాంతంలో వున్న జలాలాబాద్‌ నగరానికి, పక్కనే వున్న పాకిస్తాన్‌ సరిహద్దు ప్రాంతంలో ఈ దాడి జరిగింది. గత వారం కాబూల్‌లో 20 మందికి పైగా బలిగొన్న ఆత్మాహుతి దాడి కన్నా ఇది చిన్నదే అయినప్పటికీ ఈ దాడి అనంతరం దేశవ్యాప్తంగా హింసాకాండ చెలరేగింది. అయితే ఈ దాడికి తామే బాధ్యత వహిస్తున్నట్లు ఇప్పటి వరకూ ఏ మిలిటెంట్‌ సంస్థా ప్రకటించలేదని ప్రావిన్షియల్‌ గవర్నర్‌ కార్యాలయం వెల్లడించింది. దాడి అనంతరం కనీసం 30కి పైగా మృతదేహాలను ఆస్పత్రికి తరలించారని, ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం వుందని నంగర్‌హర్‌ ప్రావిన్షియల్‌ కౌన్సిల్‌ సభ్యుడు సోహ్రబ్‌ ఖాద్రి చెప్పారు.