జీడి పప్పులు సరిగా లేవని మండిపడ్డ దేశాధ్యక్షుడు

వాస్తవం ప్రతినిధి: శ్రీలంక విమానంలో జీడి పప్పుల పై ఆ దేశ అధ్యక్షుడు మైత్రి పాల సిరిసేన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నేను ఖాఠ్మండూ నుంచి తిరిగి వస్తోన్న సమయంలో శ్రీలంక విమానంలో నాకు కొన్ని జీడిపప్పులు వడ్డించారు. అవి పాడైపోయి కనిపించాయి. వాటిని కనీసం కుక్కలు కూడా తినవు’ అని సిరిసేన తీవ్రంగా మండిపడ్డారు. అంతేకాకుండా  ‘వీటిని కొనుగోలు చేసి, నిర్వహించే వారెవరో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను’ అని అనంతరం ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపధ్యంలో బిజినెస్‌ క్లాస్‌లో మాత్రమే అందించే ఈ జీడిపప్పులను ప్రస్తుతం పూర్తిగా అందించడం మానేస్తున్నామని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. అలాగే దుబాయికి చెందిన సరఫరాదారులను మార్చివేయనున్నట్లు తెలిపారు. అయితే విమానాల్లో నట్స్‌ సరిగా లేవంటూ ఆందోళన వ్యక్తం కావడం ఇదే మొదటి సారి ఏమీ కాదు. గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు వెల్లువెత్తాయి కూడా.