చెత్త రికార్డ్ ను మూటగట్టుకున్న టీమిండియా

వాస్తవం ప్రతినిధి: టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌ జట్టైన భారత్‌… ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే టీమిండియాఇంత ఘోరంగా ఓడిపోతుందని ఎవరూ అంచనా వేయలేదు. ఇరు జట్ల మధ్య జరిగిన ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్‌ 1-4 తేడాతో ఓడిపోవడం విశేషం.  ఈ ఓటమితో భారత్‌ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. అది కూడా 27 ఏళ్ల నాటిది కావడం గమనార్హం. ఇంతకీ ఆ రికార్డు ఏమిటంటే… ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను నాలుగు ఓటములతో ముగించడం. 1991-92 సీజన్‌లో ఆస్ట్రేలియాతో భారత్‌ ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ ఆడింది. ఇరు జట్ల మధ్య అడిలైడ్‌లో జరిగిన మూడో టెస్టు డ్రాగా ముగిసింది. మిగతా నాలుగు టెస్టుల్లో ఆతిథ్య ఆసీస్‌దే విజయం. అప్పుడు 0-4తో ఓడిపోయిన భారత్ మళ్లీ ఇన్నాళ్లకు ఇంతటి ఘోర సిరీస్‌ ఓటమిని మూటకట్టుకుంది. ఈ 27 ఏళ్ల వ్యవధిలో ఏ జట్టుతో ఆడిన టెస్టు సిరీస్‌నూ భారత్‌ నాలుగు ఓటములతో ముగించలేదు. 1991లో అజారుద్దీన్‌ నాయకత్వంలో భారత్‌.. ఆసీస్‌ పర్యటనకు వెళ్లింది. తాజాగా కోహ్లీ నాయకత్వంలో ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లిన భారత్‌ ఒక టెస్టులో విజయం సాధించి 1-4 తేడాతో సిరీస్‌ను చేజార్చుకుంది. ఈ సిరీస్‌ ఓడిపోయినా తాజాగా ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో భారత్‌ అగ్రస్థానంలో కొనసాగుతోంది.