10 పాయింట్లు కోల్పోయినా అగ్రస్థానంలో కొనసాగుతున్న టీమిండియా

వాస్తవం ప్రతినిధి: ఆతిథ్య ఇంగ్లాండ్‌ జట్టుతో జరిగిన ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ లో  భారత్‌ 1-4తో చేజార్చుకున్న సంగతి తెలిసిందే. దీంతో భారత్‌ తన ఖాతాలో నుంచి 10 పాయింట్లు కోల్పోయింది. ఇరు జట్ల మధ్య సిరీస్‌ ముగియగానే ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌ను వెల్లడించింది. రెండో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికాకు అగ్రస్థానంలో ఉన్న మనకు పాయింట్ల వ్యత్యాసం చాలా ఉండటంతో 10 పాయింట్లు కోల్పోయినా భారత్‌ ర్యాంకులో ఎలాంటి మార్పు రాలేదు.

కానీ ఇప్పటికీ కూడా 115 పాయింట్లతో భారత్‌ అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరోపక్క 4-1తో సిరీస్‌ దక్కించుకున్న ఇంగ్లాండ్‌ 105 పాయింట్లతో న్యూజిలాండ్‌ను వెనక్కినెట్టి నాలుగో స్థానానికి ఎగబాకింది. ఈ సిరీస్‌ ప్రారంభమయ్యే సమయానికి భారత్‌ 125 పాయింట్లతో అగ్రస్థానంలో, ఇంగ్లాండ్‌ 97 పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో విరాట్‌ కోహ్లీ యథావిధంగా అగ్రస్థానంలో కొనసాగుతుండగా… బౌలర్ల జాబితాలో ఇంగ్లాండ్‌ ఆటగాడు అండర్సన్‌ మొదటి ర్యాంకులో స్థిరంగా ఉన్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో 59.30 సగటుతో 593 పరుగులు చేసిన కోహ్లీ ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డు అందుకున్నాడు.