ప్రో కబడ్డీ ఆరో సీజన్ ప్రచార గీతం విడుదల

వాస్తవం ప్రతినిధి: నాలుగేళ్ల క్రితం ప్రారంభమైన ప్రొ కబడ్డీ లీగ్‌కు అభిమానులు బ్రహ్మరథం పడుతుండడం తో విజయవంతంగా ఈ లీగ్‌ దూసుకుపోతోంది. ఇప్పటి వరకు ఐదు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ లీగ్‌ వచ్చే నెల అక్టోబరు 5 నుంచి ఆరో సీజన్‌కు తెర తీయనున్నట్లు తెలుస్తుంది.  ఈ నేపధ్యంలో నిర్వాహకులు తాజాగా ఆరో సీజన్ ప్రచార గీతాన్ని విడుదల చేశారు. అయితే 13 వారాల పాటు సుదీర్ఘంగా ఈ సీజన్ కొనసాగానుంది. సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ఈ ప్రచార గీతం చక్కర్లు కొడుతూ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ప్రదీప్‌ నర్వాల్‌, అనూప్‌ కుమార్‌, మోను గోయత్‌, రిషాంక్‌లు ఈ వీడియోలో కనిపిస్తారు. మ్యాచ్‌లు ఆడేందుకు వారంతా ఎలా సన్నద్ధం అవుతున్నారో చూపిస్తూ ప్రచార గీతం సాగుతుంది. ‘బచ్‌పన్‌ కా ఖేల్‌ హయ్‌, బచ్చోంకా నహీ’ అన్న థీమ్‌తో ఈ సీజన్‌లో పోటీలు నిర్వహించనున్నారు. అక్టోబరు 5న ప్రారంభమయ్యే ఈ టోర్నీ వచ్చే ఏడాది జనవరి 5తో ముగియనున్నట్లు తెలుస్తుంది. 12 జట్లు రెండు గ్రూప్‌లుగా విడిపోయి పోటీల్లో తలపడనున్నాయి. సుమారు 13 వారాల పాటు 138 మ్యాచ్‌లు జరగనున్నాయి. టోర్నీలో భాగంగా తొలి మ్యాచ్‌ తమిళ్‌ తలైవాస్‌-తెలుగు టైటాన్స్‌ మధ్య జరగనుంది.