బిక్షాటనం చేస్తున్న ప్రముఖ దర్శకుడు

వాస్తవం సినిమా: బండ్లు ఓడలు – ఓడలు బండ్లు అవ్వడం అనేది సినిమా పరిశ్రమలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. ముఖ్యంగా నిర్మాతల విషయంలో ఇది జరుగుతుంది. ఒక్క సినిమా హిట్ అయితే నిర్మాత స్థాయి అమాంతం పెరుగుతుంది. అదే సినిమా ఫ్లాప్ అయితే తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న నిర్మాతలు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. తాజాగా తమిళ సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శకుడు సెంథిల్ నాథన్ సినిమాల్లో ఆఫర్ లేక పోవడంతో కలత చెంది కంచి దేవాలయం వద్ద బిక్షాటనం చేస్తూ ఉన్నాడు. ఈ విషయం తెలిసిన పలువురు తమిళ సినీ ప్రముఖులు ఆయన్ను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు.
ఒకప్పుడు ఎంజీఆర్ సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన జంబులింగం తనయుడు సెంథిల్ నాథన్.. తండ్రి నడిచిన బాటలోనే సినీ ఇండస్ట్రీకి వచ్చాడు. అసిస్టెంట్ గా కొన్నాళ్ళు పనిచేసి దర్శకుడిగా మారారు. తమిళంలో దాదాపు 20 చిత్రాలకు దర్శకత్వం వహించారు. తానే నిర్మాతగా మారి ఉన్నైనాన్ అనే చిత్రాన్ని నిర్మించారు. 2009 లో నిర్మితమైన ఈ సినిమా కొన్ని కారణాల వలన విడుదలకు నోచుకోలేదు. ఈ సినిమా తరువాత అవకాశాలు రాలేదు. పైగా బుల్లితెరపై కూడా తగినంత గుర్తింపు రాకపోగా.. సీరియల్ నుంచి తొలగించడంతో మనస్తాపం చెంది.. సినిమా ఇండస్ట్రీని వదిలి కాంచీపురం వెళ్లి అక్కడ గుడిదగ్గర భిక్షాటన చేస్తూ జీవనం సాగించడం మొదలుపెట్టారు. ఈ విషయం తెలిసిన అతని కుటుంబసభ్యులు, సినీపరిశ్రమకు చెందిన కొందరు అక్కడికి వెళ్లి రమ్మని కోరగా రానని చెప్పారట. దీంతో కుటుంబసభ్యుల పోలీసుల సహాయంతో సెంథిల్ నాథన్ ను చెన్నైకు తీసుకొచ్చి.. ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు.