యూపీ లో ఘోర ప్రమాదం!

వాస్తవం ప్రతినిధి: యూపీ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.  బుధవారం ఓ ప్రైవేటు పెట్రోకెమికల్ కర్మాగారంలో పేలుడు చోటుచేసుకుంది.  అయితే ఈ పేలుడు ధాటికి ఆరుగురు మరణించగా, ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బిజ్నోర్‌ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. మీథేన్ గ్యాస్‌ ట్యాంక్‌కు మరమ్మతులు చేస్తోన్న సమయంలో ఈ దారుణం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు కనిపించకుండా పోయినట్లు పోలీసులు తెలిపారు. కొత్వాలీ నగర పరిధిలోని నాగినా రోడ్‌కు దగ్గర్లోని మోహిత్ పెట్రో రసాయన కర్మాగారంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలోనే ఆరుగురు వ్యక్తులు మరణించగా, మిగతా వారిని దగ్గర్లోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కనిపించకుండా పోయిన వారిని గుర్తించే ప్రయత్నంలో ఉన్నట్లు వారు వెల్లడించారు. పెద్ద ఎత్తున పేలుడు సంభవించడంతో అక్కడ పనిచేస్తోన్న వారు కొన్ని మీటర్ల దూరంలో ఉన్న పొలాల్లోకి ఎగిరి పడ్డారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ కోణంలో కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.