దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భూకంపం

వాస్తవం ప్రతినిధి: దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భూకంపం సంభవించింది.  అసోం, బిహార్‌, పశ్చిమ్‌ బంగా రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈ రోజు ఉదయం భూకంపం సంభవించినట్లు తెలుస్తుంది. అయితే భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5గా నమోదయిందని అధికారులు తెలిపారు. సుమారు 15 నుంచి 20 సెకన్ల పాటు ప్రకంపనలు వచ్చాయని వివరించారు. ఈశాన్య రాష్ట్రం అసోంలోని కోక్రఝర్‌ నగరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంపకేంద్రాన్ని గుర్తించినట్లు షిల్లాంగ్‌లోని కేంద్రీయ భూకంపాల అధ్యయన సంస్థ ప్రకటించింది. పశ్చిమ బెంగా లో  ఏకంగా ఆరు జిల్లాల్లో ప్రకంపనలు సంభవించినట్లు భూకంప కేంద్ర అధికారులు తెలిపారు. అయితే ఈ భూకంపం కారణంగా ఆస్తి నష్టం జరిగిందా? అన్న విషయం తెలియాల్సి ఉంది. భూ ప్రకంపనలతో ఆయా ప్రాంతాల్లోని ఇళ్లు, కార్యాలయాల్లో ఉన్న వారంతా భయంతో బయటకు పరుగులు తీశారు. ఇవాళ ఉదయం 5.15 గంటలకు జమ్ముకాశ్మీర్‌లో కూడా స్వల్పంగా భూమి కంపించినట్లు తెలుస్తుంది. అయితే రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 4.6గా నమోదయిందని అధికారులు తెలిపారు. అనంతరం 5.43 గంటలకు కి హర్యానాలోని ఝాజ్జర్‌ జిల్లాలోనూ భూ ప్రకంపనలు వచ్చాయి. ఇదే జిల్లాలో ఈ నెల 9న స్వల్ప భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే.