ఫిలింనగర్ గణేషుడికి మహాప్రసాదంగా 600 కిలోల తాపేశ్వరం లడ్డూ

వాస్తవం ప్రతినిధి: ఫిలింనగర్ గణేషుడికి 600 కిలోల లడ్డూ మహాప్రసాదంగా వస్తుంది. హైదరాబాద్ ఫిలింనగర్ లోని దైవసన్నిధానం దేవాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన గణేషుడికి మహాప్రసాదంగా 600 కిలోల తాపేశ్వరం లడ్డూ రానుంది. తూర్పు గోదావరి తాపేశ్వరానికి చెందిన మల్లిబాబు రెండోసారి భారీ లడ్డూను మహాప్రసాదంగా ఇస్తున్నారు. ఈ లడ్డూను 220 కిలోల పంచదార, 145 కిలోల ఆవు నెయ్యి, 175 కిలోల పచ్చిపప్పు, 25 కిలోల జీడిపప్పు, 13 కిలోల బాదం, మూడు కిలోల యాలకులు(ఇలాచీ), కిలో పచ్చ కర్పూరం కలిపి తయారు చేసినట్లు మల్లిబాబు తెలిపారు. మంగళవారం రాత్రి ఈ లడ్డూ తయారీ పూర్తి అయింది. బుధవారం రాత్రికి లడ్డూ హైదరాబాద్ కు చేరనుంది. తర్వాతి రోజు సాయంత్రం 6 గంటలకు ఫిలింనగర్ గణేషుడికి మహాప్రసాదంగా పెడతారు.