పాలస్తీనా కు చెక్ పెట్టాలని భావిస్తున్న అమెరికా!

వాస్తవం ప్రతినిధి: పాలస్తీనా మిషన్‌కు చెక్ పెట్టాలని అమెరికా భావిస్తుంది. ఈ నేపధ్యంలో వాషింగ్టన్‌లోని పాలస్తీనా లిబరేషన్‌ ఆర్గనైజేషన్‌ (పిఎల్‌ఓ) కార్యాలయాన్ని మూసివేయాలని డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఈ విషయాన్ని త్వరలోనే అధికారి కంగా ప్రకటించే అవకాశం ఉందని అమెరికా మీడియాలో ఆదివారం కథనాలు వెలువడ్డాయి. ఇటీవల పాలస్తీనా లోని ఆసుపత్రులకు అందించే ఆర్ధిక సాయాన్ని నిలిపివేసిన అమెరికా ఇప్పుడు తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. పిఎల్‌ఓ కార్యాలయం మూసి వేత నిర్ణయాన్ని ట్రంప్‌ జాతీయ భద్రతా సలహా దారుడు జాన్‌ బోల్టన్‌ ప్రకటిస్తారని వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ తన కథనంలో పేర్కొంది. ‘ ఇజ్రాయిల్‌తో ప్రత్యక్ష, అర్థ వంతమైన చర్చలు ప్రారంభించడానికి పాలస్తీనీయులు తిరస్కరిస్తే పాలస్తీనా లిబరేషన్‌ ఆర్గనైజేషన్‌ను ట్రంప్‌ ప్రభుత్వం అనుమతించదు’ అని వాల్‌ స్ట్రీట్‌ పత్రిక తెలిపింది.
అలాగే గాజాలో ఇజ్రాయిల్‌ దాడులపై విచారణపై దృష్టి పెట్టిన అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు (ఐసిసి)పై కూడా ట్రంప్‌ ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని పత్రిక తెలిపింది.