భద్రతా సిబ్బంది ని దాటి వచ్చి మరీ పాదాలను తాకిన క్రికెటర్ అభిమాని

వాస్తవం ప్రతినిధి: క్రికెట్‌ మైదానంలో మ్యాచ్‌ జరుగుతోన్న సమయంలో… భద్రతా సిబ్బందిని దాటి వచ్చి భారత్ మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ పాదాలను తాకాడు ఒక అభిమాని. అయితే ఇది ఎప్పుడో జరిగిన ఘటన కాదులేండి. తాజాగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రెండు రోజుల పాటు కర్ణాటక చలన చిత్ర కప్‌(కేసీసీ) టోర్నీ జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆరు జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో సినీ నటులు, మాజీ క్రికెటర్లతో పాటు కర్ణాటకకు చెందిన క్రికెటర్లు పాల్గొన్నారు. నటుడు సుదీప్‌ నాయకత్వం వహించిన కదంబ లయన్స్‌ జట్టులో సెహ్వాగ్‌ సభ్యుడు. టోర్నీలో భాగంగా ఈగల్స్‌ జట్టుతో తలపడుతోన్న సమయంలో సెహ్వాగ్‌ మైదానంలో ఫీల్డింగ్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. అయితే ఇంతలో గ్యాలరీలో కూర్చుని మ్యాచ్‌ వీక్షిస్తోన్న ఓ అభిమాని భద్రతా సిబ్బందిని దాటి నేరుగా మైదానంలోకి వచ్చి సెహ్వాగ్‌ పాదాలను తాకుతూ తన అభిమానాన్ని చాటాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అయితే ఇదే మ్యాచ్‌లో సెహ్వాగ్‌ ఓ భారీ సిక్స్‌ కొట్టి అందర్నీ ఆశ్చర్యపరిచాడు కూడా.