త్వరలో గ్రూప్-1 నోటిఫికేషన్

వాస్తవం ప్రతినిధి: తెలంగాణలో 128 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీకి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు త్వరలో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేయాలని టీఎస్‌పీఎస్సీ భావిస్తోంది. అయితే రాష్ట్రంలో కొత్త జోనల్‌ విధానం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సవరణ ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది.
గతంలో గ్రూప్‌-1 పోస్టులు రాష్ట్ర స్థాయి కేటగిరీలో ఉండేవి. తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం ఇవి మల్టీ జోనల్‌ కేటగిరీ పోస్టుల కిందకి వచ్చాయి. ఆ మేరకు 128 పోస్టులను రెండు మల్టీ జోనల్‌ కేటగిరీ పోస్టుల కింద ఖాళీల ఆధారంగా విభజించాల్సి ఉంటుంది. గ్రూప్‌-1 పోస్టులు కాకుండా మరో 1835 పోస్టులకు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేయాల్సి ఉంది. వీటిని కూడా జిల్లా, జోనల్‌, మల్టీ జోనల్‌ ఆధారంగా పోస్టుల విభజన చేసి, కొత్త రోస్టర్‌ నిర్ధారణ చేసి ఆయా శాఖలు టీఎస్‌పీఎస్సీకి పంపాల్సి ఉంటుంది. దాంతో టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ వెల్లడించేందుకు అవకాశం ఉంటుంది. నోటిఫికేషన్లకు ఇబ్బందేమీ ఉండదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.