దుబాయ్ రాజకుమార్తె ఏమైంది!

వాస్తవం ప్రతినిధి: పేరుకే రాజు కుమార్తె. కానీ అడుగడుగునా ఆంక్షలు, బయట ప్రపంచం ఏమిటో తెలీదు. స్వేచ్ఛ అన్న మాటకి అర్థం తెలీదు. అండగా ఉండాల్సిన  కన్నతండ్రే వేధిస్తూ ఉంటే, తనకున్న అధికార దర్పంతో గాలి వెలుతురు లేని చీకటి గదిలో మూడేళ్ల పాటు బంధించి చిత్రహింసలు పెడితే ఏం చేయాలి ? ఎవరికి చెప్పుకోవాలి ? ఆ ఆంక్షల చట్రాలను ఛేదించుకొని స్వేచ్ఛగా ఎగిరిపోవాలని, అమెరికాలో ఆశ్రయం పొందాలని అనుకున్న ఆ యువరాణి ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఇది దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మకతూమ్ కుమార్తె షికా లతీఫా దీన గాధ. అయితే ఇప్పుడు ఆమె ఏమైందో, ఎక్కడుందో అన్న విషయం ఎవరికీ తెలీడం లేదు. షికా లతీఫా కనిపించకుండా పోవడం వెనుక భారత్‌ ప్రమేయం ఉందని ఇప్పుడు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భారత్‌ తీరప్రాంత రక్షణ దళం మానవ హక్కుల్ని తీవ్రంగా ఉల్లంఘించి ఆశ్రయం కోరి వచ్చిన లతీఫాను తిరిగి దుబాయ్‌కి పంపించారంటూ అంతర్జాతీయ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఆరోపించింది. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలంటూ భారత ప్రభుత్వాన్ని కోరినట్లు తెలుస్తుంది.