పాలస్తీనా ఆసుపత్రులకు అందజేస్తున్న సాయం పై కోత విధించిన అమెరికా

వాస్తవం ప్రతినిధి: మొన్నటికి మొన్న పాక్ కు సాయాన్ని నిలిపివేసిన అగ్రరాజ్యం అమెరికా ఇప్పుడు పాలస్తీనా ఆస్పత్రులకు అందచేస్తున్న సాయంపై కోత విధించినట్లు తెలుస్తుంది. పాలస్తీనియన్లకు అమెరికా అందచేస్తున్న సాయంపై ఇటీవల సమీక్షించిన అధ్యక్షుడు డోనాల్డ్  ట్రంప్‌ ఈ నిధులను ‘దేశ ప్రయోజనాల’కు అనుగుణంగా ఖర్చు చేస్తామని ప్రకటించారు.. ఈ మేరకు తూర్పుజెరూసలేంలో వున్న ఆస్పత్రులకు అందచేస్తున్న 2.5 కోట్ల డాలర్ల సాయాన్ని నిలిపివేయాలని ట్రంప్‌ ఆదేశాలు జారీ చేశారని అమెరికా విదేశాంగశాఖ అధికారి ఒకరు చెప్పారు. పాలస్తీనాకు అమెరికా అందచేస్తున్న సాయంపై ఇటీవల సమీక్షించిన ట్రంప్‌ తూర్పు జెరూసలేం ఆస్పత్రులకు అందచేస్తున్న నిధులను ‘అత్యంత ప్రాధాన్యతా ప్రాజెక్టుల’కు మళ్లిస్తున్నటు ఆరోపించారు. ట్రంప్‌ అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన తరువాత ఇజ్రాయిల్‌తో కలిసి పాలస్తీనాకు వ్యతిరేకంగా పలు చర్యలు తీసుకున్నారు. ఈ నిధుల కోతపై పాలస్తీనా తీవ్రంగా స్పందించింది. ఈ చర్యతో మధ్యప్రాచ్యంలో మరింత పేదరికం ప్రబలటంతో పాటు ప్రజాగ్రహంతో రాజకీయ అస్థిరతకు దారి తీస్తుందని పాలస్తీనా విదేశాంగశాఖ ఒక ప్రకటనలో హెచ్చరించింది. పాలస్తీనా వాదాన్ని నీరు కార్చేందుకే ట్రంప్‌ సర్కారు ఈ చర్య తీసుకున్నదని పాలస్తీనా విదేశాంగశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది