తెలుగు రాష్ట్రాల్లో భారత్ బంద్ ప్రభావం, పలువురు అరెస్ట్

వాస్తవం ప్రతినిధి: పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ‘భారత్ బంద్’ పిలుపునకు పలు పార్టీలు మద్దతు పలకడంతో,తెలుగు రాష్ట్రాల్లో బంద్ కొనసాగుతోంది. . ఉదయం నుంచే ఆందోళనకారులు రోడ్లపైకెక్కి ఆర్టీసీ డిపోల నుంచి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. పలు ప్రాంతాల్లో వివిధ పార్టీల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
విజయవాడ బస్టాండ్ వద్ద అఖిలపక్ష నేతలు ఆందోళన చేపట్టారు. బస్సులు బయటకు రాకుండా అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. బంద్‌ సందర్భంగా విజయవాడలో చాలా వరకు స్కూళ్లు, దుకాణాలు స్వచ్చందంగా మూసివేశారు.
మరోవైపు గుంటూరులో జనసేన కార్యకర్తలు నిరసన తెలిపారు. గుంటూరు వద్ద బస్సులను అడ్డుకున్న జనసేన కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కడప ఆర్టీసీ బస్టాండ్ ఎదుట కాంగ్రెస్, జనసేన, వామపక్షాలు ధర్నా నిర్వహించాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, పెరుగుతున్న ధరలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయని, పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తేవాలని డిమాండ్ చేశాయి.
తిరుపతిలో శ్రీవారి భక్తులను తిరుమలకు చేరవేసే బస్సులు మినహా మరేవీ నడవడం లేదు. విశాఖ, గుంటూరు, నెల్లూరు, ఏలూరు, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, మెదక్, నల్గొండ తదితర ప్రాంతాల్లోనూ బంద్ ప్రభావం కనిపిస్తోంది.

తణుకు, ఏలూరు, తదితర ప్రాంతాల్లో ఆందోళన చేస్తున్న పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖలో కాంగ్రెస్, జనసేన, వామపక్ష కార్యకర్తలు జాతీయ రహదారిని దిగ్బంధించారు. దీంతో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. శ్రీకాకుళం జిల్లా పాలకొండ, పలాస, టెక్కలి ప్రాంతాల్లో సినిమా హాల్స్ సైతం మూతపడ్డాయి. అన్ని బస్సు డిపోల వద్దా పోలీసులు భారీ సంఖ్యలో మోహరించి భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు.