కాంగ్రెస్ పార్టీతో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు ఉండదు: నిమ్మకాయల చినరాజప్ప

వాస్తవం ప్రతినిధి: ఏపీలో మాత్రం కాంగ్రెస్ పార్టీతో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు ఉండదని ఏపీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథరెడ్డి సతీమణ ఉమాదేవి ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రఘునాథరెడ్డిని పరామర్శించే నిమిత్తం ఈరోజు ఆయన అనంతపురం వెళ్లారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ..తెలంగాణలో ఎన్నికల పొత్తు విషయాన్ని ప్రస్తావించారు. టీఆర్ఎస్ ను ఎదుర్కోవడానికి అక్కడి పరిస్థితులను బట్టి ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలో చంద్రబాబు నిర్ణయం చేస్తారని చెప్పారు.
అలాగే ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై చినరాజప్ప విమర్శలు గుప్పించారు. దివాకర్ రెడ్డికి ఇంకా కాంగ్రెస్ పార్టీ వాసన పోలేదని, అధికార పార్టీలో ఉన్నా పోలీస్ వ్యవస్థపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. వైఎస్ జగన్ గురించి మాట్లాడుతూ, జగన్ తప్పు చేశారు కనుకే కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని అన్నారు.