ఈఏసి నుంచి ప్రముఖ ఆర్ధిక వేత్త అతిఫ్ ను బహిష్కరించిన ఇమ్రాన్ సర్కార్

వాస్తవం ప్రతినిధి: పాకిస్థాన్ ఆర్ధిక సలహా మండలి(ఈఏసీ) నుంచి ప్రముఖ ఆర్ధిక వేత్త అతిఫ్ మియాన్ ను బహిష్కరించారు. దీనితో ఈఏసీ నుంచి లండన్‌కు చెందిన ప్రముఖ ఆర్థికవేత్త ప్రొఫెసర్‌ ఇమ్రాన్‌ రసూల్‌ తప్పుకున్నట్లు తెలుస్తుంది. ఇస్లాం విరుద్ధ అహ్మదీ మైనార్టీ వర్గానికి చెందినవారన్న కారణంతో… ప్రముఖ ఆర్థికవేత్త అతిఫ్‌ మియాన్‌ను ఈఏసీ నుంచి బహిష్కరించారని ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ  రసూల్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. మియాన్‌…పాకిస్థాన్‌ సంతతికి చెందిన అమెరికన్‌. ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌. ఇమ్రాన్‌ఖాన్‌ ఆయన్ను ఏరికోరి ఈఏసీ సభ్యునిగా ప్రతిపాదించారు. అయితే, మియాన్‌ అహ్మదీ వర్గానికి చెందినవాడంటూ పలు మత సంస్థలు గగ్గోలు పెట్టడంతో… ప్రభుత్వం ఆయన్ను ఈఏసీ నుంచి తప్పించింది. అయితే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ- ఇప్పటికే హార్వర్డ్‌ కెనడీ స్కూల్‌కు చెందిన ప్రొఫెసర్‌ ఆసిమ్‌ ఇజాజ్‌ ఖాజా ఈఏసీ సభ్యత్వానికి రాజీనామా చేయగా, ఇప్పుడు తాజాగా మరో ప్రొఫెసర్ ఇమ్రాన్ రసూల్ కూడా తప్పుకున్నారు. మరోపక్క తాజా పరిణామం నేపథ్యంలో- పాకిస్థాన్‌ సర్కారు ఛాందసవాదుల ముందు మోకరిల్లుతోందంటూ ఇమ్రాన్‌ఖాన్‌ మాజీ భార్య జెమీమా గోల్డ్‌స్మిత్‌ వ్యాఖ్యానించారు.