నకిలీ వార్తలు,వదంతులు అరికట్టేందుకు మరికొంత సమయం: జుకర్ బర్గ్

వాస్తవం ప్రతినిధి: ఫేస్‌బుక్‌లో నకిలీ వార్తలు, వదంతులను అరికట్టేందుకు తమకు మరికొంత సమయం అవసరమని ఆ సంస్థ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ తెలిపారు. దాదాపు 8.7 కోట్ల మంది అమెరికన్ల ఫేస్‌బుక్‌ వివరాలను కేంబ్రిడ్జ్‌ అనలిటికా తస్కరించిన సంగతి తెలిసిందే. దీనితో ఈ వ్యవహారానికి సంబంధించి అమెరికా కాంగ్రెస్‌ ముందు హాజరైన జుకర్ బర్గ్ కాంగ్రెస్‌ సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఇబ్బందిపడ్డారు కూడా. ఈ నేపథ్యంలో జుకర్‌బర్గ్‌ శుక్రవారం తన ఫేస్‌బుక్‌ ఖాతాలో ఓ పోస్ట్‌ పెట్టారు. ఫేస్‌బుక్‌లో నకిలీ వార్తలు, వదంతులను వ్యాప్తిచేస్తున్న పేజీలను 2017 నుంచి తొలగిస్తూనే ఉన్నామని ఆయన తెలిపారు. ఈ ప్రక్రియ 2019 వరకూ కొనసాగినా ఇలాంటి అకౌంట్లను పూర్తిస్థాయిలో తొలగించలేమని ఆయన వెల్లడించారు.