ఇంగ్లాండ్ పేసర్ అండర్సన్ కు జరిమానా

వాస్తవం ప్రతినిధి: ఇంగ్లాండ్‌ పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌కు జరిమానా విధించినట్లు తెలుస్తుంది. టీమిండియాతో జరుగుతున్న చివరి టెస్టులో రెండో రోజు అతడు అంపైర్‌ నిర్ణయాన్ని వ్యతిరేకించాడు. క్రమశిక్షణ చర్యల కింద రిఫరీ అతడి మ్యాచ్‌ ఫీజులో 15 శాతం కోత విధించారు. దాంతో పాటు అతడి ఖాతాలో ఒక డీమెరిట్‌ పాయింట్‌ను జతచేశారు. 2016 సెప్టెంబర్‌లో సవరించిన కొత్త నియమావళి తర్వాత అండర్సన్‌ చేసిన తొలి తప్పు ఇదే కావడం గమనార్హం.

రెండో రోజు ఆటలో విరాట్‌ కోహ్లిని అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించడమే అండర్సన్‌ కోపానికి అసలు కారణం. అండర్సన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 29వ ఓవర్లో బంతి కోహ్లి ప్యాడ్లను తాకింది. బౌలర్‌‌ వెంటనే అప్పీల్‌ చేసినా అంపైర్‌ ధర్మసేన అతని అప్పీల్‌ను తిరస్కరించాడు. కానీ బంతి వికెట్లను తాకుతుందని భావించిన జిమ్మి.. రివ్యూ కోరాడు. రివ్యూలో బంతి వికెట్లకు తాకే అవకాశం ఉన్నట్లు కనిపించినా.. థర్డ్‌ అంపైర్‌ నిర్ణయాన్ని ఫీల్డ్‌ అంపైర్‌కు వదిలేశాడు. కానీ ధర్మసేన తన నిర్ణయానికే కట్టుబడి ఉండడంతో కోహ్లి బతికిపోయాడు. దీంతో ధర్మసేన దగ్గరకు వెళ్లి కోపంగా మాట్లాడిన అండర్సన్‌.. కోహ్లిని కూడా ఏదో అన్నాడు. ఫీల్డ్‌ అంపైర్లు కుమార ధర్మసేన, జోయెల్‌ విల్సన్‌, మూడో అంపైర్‌ బ్రూస్‌ ఆక్సన్‌ఫొర్డ్‌, నాలుగో అంపైర్‌ టిమ్‌ రాబిన్‌ సన్‌ రిఫరీకి అండర్సన్‌పై ఫిర్యాదు చేశారు. విచారణలో జిమ్మీ తప్పు అంగీకరించాడు. దీంతో లెవల్‌-1 తప్పు కింద అతడికి జరిమానా విధించినట్లు తెలుస్తుంది.