రామ మందిరం విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ మంత్రి

వాస్తవం ప్రతినిధి: రామ మందిరం విషయంలో బీజేపీ మంత్రి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్‌ మంత్రి ముకుత్‌ బిహారీ వర్మ మాట్లాడుతూ..‘ బీజేపీ హామీ ఇచ్చినట్టుగానే అయోధ్యలో రామ మందిరం నిర్మించి తీరుతాం.. ఎందుకంటే సుప్రీం కోర్టు మాది’  అని అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు వివాదాస్పదమైంది. బహ్రయిచ్‌ జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘అభివృద్ధి ప్రణాళికతో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటికీ.. తప్పకుండా రామ మందిరం నిర్మించి తీరుతాం. ప్రస్తుతం ఈ అంశం సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉంది.. సుప్రీం కోర్టు మాది. న్యాయవ్యవస్థ, పరిపాలన వ్యవస్థ, దేశం అలాగే రామ మందిరం కూడా మాదే’నని ఆయన వ్యాఖ్యలు చేయడం తో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనితో వర్మ కాస్త వెనక్కి తగ్గారు. సుప్రీం కోర్టు మాది అంటే దేశ ప్రజలందరిది అనే ఉద్దేశంతో అన్నానని.. మాది అంటే తమ ప్రభుత్వానిది కాదని వివరణ ఇచ్చారు. గతంలో యూపీ డిప్యూటీ సీఎం కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య కూడా గతంలో ఇలాంటి వ్యాఖ్యలే చేసిన సంగతి తెలిసిందే.