ఈ ఇంటి ఓట్లు అమ్మబడవు..

వాస్తవం ప్రతినిధి: సాధారణంగా ఎలక్షన్స్ కి ఒక ఏడాది సమయం ఉంది అనగానే నాయకులూ ఒక్కసారిగా ప్రజలను ఆకర్షించే పని పెట్టుకుంటారు. ఇక ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఓట్ల కోసం విధుల్లో నడుస్తూ ప్రచారాలను నిర్వహిస్తారు .ప్రతి ఇంటికి వెళ్లి మీ ఓటు మా పార్టీ గుర్తుకే వెయ్యాలి అంటూ బ్రతిమాలుకుంటారు. ఇకపోతే ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ రద్దుతో రాష్ట్రంలో ఎన్నికల వేడి రగులుకుంది. టీఆర్ఎస్ అప్పుడే ప్రజల్లోకి వెళ్లిపోయి ప్రచారాన్ని మొదలుపెట్టింది. కేసీఆర్ తొలి సభ కూడా పెట్టేసి జోరుమీదున్నారు. కాంగ్రెస్, టీడీపీ, ఇతర పార్టీలు కూడా సభలు, సమావేశాల నిర్వహణ కోసం రంగం సిద్ధం చేస్తున్నాయి. ఈసీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించాక నాయకుల కోలాహలం మొదలవుతుంది. ఓటర్లు దేవుళ్లంటూ ఎక్కేమెట్టూ, దిగేమెట్టుతో బిజీగా మారిపోతారు. ప్రలోభాలు మొదలవుతాయి.

ఇవన్నీ ముందే ఊహించాడు జనగామ జిల్లా కోమళ్లకు చెందిన తాళ్లపల్లి వెంకటస్వామి. అందుకే, తన ఇంటికి ఎవరూ రావద్దని, తాము అమ్ముడుపోబోమంటూ ఇంటి గోడపై రాయించాడు. అందరినీ ఆకట్టుకుంటున్న ఆ గోడపై ‘‘ఈ ఇంటి ఓట్లు అమ్మబడవు’’ అని పెద్ద అక్షరాలతో రాసి ఉండగా కింద ఆయన పేరు ఉంది. ఆ తర్వాత.. ‘నా జాతి ప్రజలకు కత్తి చేతికి ఇవ్వలేదు- ఓటు హక్కు ఆయుధంగా ఇచ్చాను. పోరాడి రాజులవుతారో.. ఓడిపోయి(అమ్ముడుపోయి) బానిసలవుతారో నిర్ణయం మీ చేతిలో ఉంది’ అన్న అంబేద్కర్ సూక్తి ఉంది. తాటికాయంత అక్షరాలతో రాసిన ఈ పెయింటింగ్ చూశాక కూడా నాయకులు ఆయన ఇంట్లోకి వెళ్లే సాహసం చేస్తారంటారా? ఏమో.. వేచి చూద్దాం!