సోనాలి బింద్రే చనిపోయిందంటూ బీజేపీ ఎమ్మెల్యే ట్వీట్.. మండిపడుతున్న నెటిజన్లు!

వాస్తవం ప్రతినిధి: మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ మరోమారు వివాదంలో చిక్కుకున్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో అమ్మాయిలను కిడ్నాప్ చేయాలని యువకులకు పిలుపునిచ్చి వార్తల్లోకి ఎక్కిన ఆయన తాజాగా మరోమారు చిక్కుల్లో పడ్డారు. క్యాన్సర్‌తో బాధపడుతూ అమెరికాలో చికిత్స పొందుతున్న నటి సోనాలి బెంద్రేను సదరు ఎమ్మెల్యే తన అవగాహనా రాహిత్యంతో ‘చంపేశాడు’! ఎవడో పోస్ట్ చేసిన ఫేక్ పోస్ట్ మీద స్క్రీన్ షాట్ తీసుకుని తన ట్విట్టర్లో రీపోస్ట్ చేస్తూ.. కేన్సర్‌తో బాధపడుతున్న బాలీవుడ్ నటి సోనాలి బింద్రే కన్నుమూసిందని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలంటూ ట్వీట్ చేసి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు. అది చూసిన నెటిజన్లు ఆయనను ట్రోల్ చేస్తూ ఆటాడుకున్నారు.

దీంతో ఎమ్మెల్యే స్పందించారు. ట్వీట్‌ను డిలీట్ చేసి క్షమాపణలు కోరుతూ మరో ట్వీట్ చేశారు. ‘‘సోనాలి గురించి వచ్చిన వార్తల్లో నిజం లేదు. ఆమె త్వరగా కోలుకోవాలని, తిరిగి పూర్తి ఆరోగ్యవంతురాలు కావాలని భగవంతుడిని వేడుకుంటున్నా’’ అని పేర్కొన్నారు.