భారత్ పై ప్రతీకారం తీర్చుకుంటాం: పాక్ ఆర్మీ చీఫ్

వాస్తవం ప్రతినిధి: దాయాది దేశం పాకిస్తాన్‌ మరోసారి తన కపట బుద్ధిని ప్రదర్శించింది. ఓవైపు.. భారత్‌తో సంబంధాలు మెరుగుపరచుకునేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ చెబుతుంటే… మరోవైపు పాక్‌ ఆర్మీ చీఫ్‌ ఖమర్‌ బజ్వా మాత్రం భారత్‌పై ప్రతీకారం తీర్చుకుంటామంటూ హెచ్చరికలు జారీ చేయడం విశేషం. భారత్‌ చెరలో ఉన్న కాశ్మీర్ కు విముక్తి కలిగిస్తామంటూ దాయాది దేశం పాక్ మరోసారి ప్రగల్భాలు పలికింది. పాకిస్తాన్‌ రక్షణ రంగం వెబ్‌సైట్‌ కథనం ప్రకారం… ‘ భారత్‌ ఆక్రమిత కాశ్మీర్‌ ప్రజలు ఎంతో ధైర్య సాహసాలతో పోరాడుతున్నారు. వారికి విముక్తి కలిగించేందుకు మా వంతు ప్రయత్నం చేస్తాం అంటూ ఆయన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది. కాశ్మీర్‌లోని అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ముల త్యాగాలకు సలాం చేస్తున్నా. సరిహద్దుల్లో ప్రాణాలు కోల్పోయిన మా సైనికుల మృతికి తప్పక ప్రతీకారం తీర్చుకుంటాం’ అంటూ పాక్‌ ఆర్మీ చీఫ్‌ ఖమర్‌ జావేద్‌ బజ్వా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్లు ఆ వెబ్ సైట్ లో పేర్కొంది. దీంతో పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ విషయంలో పాకిస్తాన్‌ అవలంబిస్తున్న రెండు నాల్కల ధోరణి స్పష్టంగా అర్థమైందంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.