ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్

వాస్తవం ప్రతినిధి: మరికొద్ది రోజుల్లో ఆసియా కప్‌ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో నిర్వాహకులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈ నెల 15 నుంచి యూఏఈ వేదికగా ఆసియా కప్‌ టోర్నీ జరగనున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా శుక్రవారం ఆసియా కప్‌ టోర్నీలో విజేతగా నిలిచే జట్టు అందుకునే ట్రోఫీని యూఏఈ మంత్రి షేక్‌ నయన్‌ బిన్‌ ముబారక్‌ ఆల్‌ నయన్‌ ఆవిష్కరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోను, వీడియోను ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌ తన ఫేస్‌బుక్‌ పేజీ ద్వారా అభిమానులతో పంచుకుంది. అయితే ఈ టోర్నీలో భాగంగా భారత్‌ 18న తన తొలి మ్యాచ్‌ను హాంకాంగ్‌తో ఆడనుంది. ఆ తర్వాతి రోజే భారత్‌ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఢీకొట్టనుంది. గత ఏడాది ఛాంపియన్స్‌ ట్రోఫీ అనంతరం భారత్‌-పాక్‌ ఆడబోతున్న ఈ మ్యాచ్‌ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.