సాదరంగా హిమ దాస్ ని ఆహ్వానించనున్నఅభిమానులు

వాస్తవం ప్రతినిధి: ఆసియన్‌ క్రీడల్లో మూడు పతకాలు సాధించి భారతదేశాన్ని గర్వపడేలా చేసిన స్ప్రింటర్‌ హిమదాస్‌, ఈరోజు ఆమె తన స్వస్థలమైన గువహటికి చేరుకోనున్నారు. ఈ నేపధ్యంలో అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనవాల్‌.. హిమదాస్‌ను సాదరంగా ఆహ్వానించడానికి సిద్దమయ్యారు. అయితే మరోపక్క భారత్‌కు మూడు పతకాలు తెచ్చిపెట్టిన హిమదాస్‌ను అభిమానులు వినూత్నంగా స్వస్థలానికి ఆహ్వానించాలనుకున్నారు. ఇందుకోసం అసోం విమానాశ్రయంలో ఎర్ర తివాచీ వేసి దానిపై స్టార్ట్‌..1,2,3,4,5,6 అన్న సంఖ్యలతో ట్రాక్‌ను రూపొందించారు. ఆసియన్‌ క్రీడల్లో హిమదాస్‌ ఇలాంటి ట్రాక్‌‌పైనే పరిగెత్తి పతకాలు సాధించారు. హిమదాస్‌ కోసం అభిమానులు వేసిన ఈ ట్రాక్‌ సోషల్‌మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. గువహటి చేరుకున్నాక హిమదాస్‌.. సారుసుజాయ్‌ స్టేడియం, డాక్టర్‌ భూపేన్‌ హజారిక సమాధి క్షేత్ర స్థూపం వద్దకు చేరుకుంటారు. శ్రీమంత శంకరదేవ్‌ కళాక్షేత్రంలో అసోం రాష్ట్ర ప్రభుత్వం ఆమెను సన్మానించనుంది. ఐఏఏఎఫ్‌ ప్రపంచ అండర్‌-20 అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో స్వర్ణం గెలిచిన భారత తొలి మహిళా అథ్లెట్‌గా 18 ఏళ్ల హిమదాస్‌ చరిత్ర సృష్టించారు.