“కేసీఆర్ ఇప్పుడు తనకు మళ్లీ పెళ్లి చేయండి అంటున్నాడు ” : నారాయణ

వాస్తవం ప్రతినిధి: గతంలో ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి, సహా పలువురు నేతలపై వివిధ సందర్భాల్లో తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ ఈ సారి కేసీఆర్ పై బీభత్సమైన సెటైర్ వేసేశారు. కేసీఆర్‌ తీరు చూస్తుంటే శోభనం గది నుంచి మధ్య రాత్రి పారిపోయిన పెళ్లి కొడుకు మాదిరిగా ఉందని నారాయణ ఎద్దేవా చేశారు. ఇప్పుడు తనకు మళ్లీ పెళ్లి చేయండి..సత్తా చాటుతా, దుమ్ము దులుపుతా, పొడిచేస్తా, చించేస్తా.. అన్నట్లు ముందస్తు ఎన్నికల కోసం కేసీఆర్ హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. ఇంకా 9 నెలల కాలం పరిపాలనకు అవకాశం ఉండగా, ఏం తొందరని ఇప్పుడే ఎన్నికల కోసం ముందస్తుకు రెడీ అయ్యారని నిలదీశారు.
పైగా ఎన్నికల నోటిఫికేషన్, ఎన్నికలు జరిగే సమయం గురించి కూడా కేసీఆర్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కేసీఆర్ పూర్తిగా లక్ష్మణరేఖ దాటేశారని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వ్యవహారశైలి, ఎన్నికల జరిగే సమయం గురించి చెప్పడంపై ఈసీ ప్రధానాధికారి కూడా విచారం వ్యక్తం చేశారని నారాయణ తెలిపారు.