కేవలం బీసీ మహిళను అన్న కారణంతోనే నన్ను అవమానించారు: కొండా సురేఖ

వాస్తవం ప్రతినిధి: టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఇటీవల ప్రకటించిన 105 అభ్యర్థుల తొలి జాబితాలో తనకు చోటు దక్కకపోవడంపై మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం బీసీ మహిళను అన్న కారణంతోనే తనను అవమానించారని వ్యాఖ్యానించారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో కొండా సురేఖ దంపతులు మీడియాతో మాట్లాడుతూ…పార్టీ నుంచి పొమ్మనకుండా పొగ పెడుతున్నారని కొండా సురేఖ ఆరోపించారు. రెండు సీట్ల కోసం మేము అడగలేదు. మాపై అనవసర ప్రచారం చేస్తున్నారని తెలిపారు. వరంగల్ ఈస్ట్ ఇస్తామని చెప్పారు.. మాట తప్పారన్నారు. టీఆర్ఎస్ వారి సర్వే నివేదికలు బయటపెట్టాలి అని కొండా సురేఖ డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ సమాధానం బట్టి మా నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. సమాధానం రాకపోతే బహిరంగ లేఖ రాస్తామన్నారు.
తెలంగాణ అంటే కల్వకుంట్ల కుటుంబం కాదని విమర్శించారు. మా సమస్యలు అన్ని సంతోష్ , కేటీఆర్, హరీష్ రావు కు ఫోన్ లలో చెప్పాను అని పేర్కొన్నారు. నాకు టీఆర్ఎస్ లో అవమానం జరిగింది.. దానిపై టిఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పాలన్నారు. నా నియోజకవర్గ సమస్యకు ప్రధాన కారణం కేటీఆర్.. మాకు దొడ్డిదారి తెల్వదన్నారు. టీఆర్ఎస్ పార్టీలోకి మేము రావడం హరీష్ రావు కు ఇష్టం లేదని ఆమె తెలిపారు. ముందస్తుకు వెళ్లడం సరైన నిర్ణయం కాదన్నారు.