కొత్త తరహ నిరంకుశత్వానికి పాల్పడుతున్న సిరిజా ప్రభుత్వం

వాస్తవం ప్రతినిధి: సిరిజా-అనెల్‌ ప్రభుత్వం ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేందుకు కొత్త తరహా నిరంకుశత్వానికి పాల్పడుతోందని గ్రీస్ కమ్యూనిస్ట్ పార్టీ(కెకెఇ) విమర్శించింది. అంతర్జాతీయ ద్రవ్య సంస్థలతో రుణ ఒప్పందం రద్దుతో ‘నూతన శకం’ ఆరంభ మైనట్లుగా సిరిజా ప్రభుత్వం సాగిస్తున్న ప్రచారంలోని డొల్లత నాన్ని బయటపెట్టి వాస్తవాలను ప్రజల ముందుంచుతున్నందుకు తమ పార్టీ నేతలపై తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నదని ఆ పార్టీ విమర్శించింది. పార్టీ కేంద్ర కమిటీ బుధవారం నాడిక్కడ ఈ మేరకు ఒక పత్రికా ప్రకటన విడుదల జేసింది. సెప్టెంబరు 2వ తేదీ రాత్రి లారిసాలో నల్గురు కెకెఇ నేతల నిర్బంధం దీనికి ఒక నిదర్శనమని ఆ పార్టీ పేర్కొంది. గ్రీస్‌ కమ్యూనిస్టు పార్టీ (కెకెఇ) శతవార్షికోత్సవాలు, కెఎన్‌ఇ 50 వ వార్షికోత్సవాలను పురస్కరించుకుని కమ్యూనిస్టు యువజనోత్సవాలను నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఉత్సవాల కోసం ప్రచారంలో భాగంగా పోస్టర్లు అతికిస్తున్న నేతలను ఏదో నేరస్తులను పట్టుకున్నట్లుగా భద్రతాదళాలు, మెరుపు దళాలు దాడి చేసి పట్టుకుని రాత్రంతా నిర్బంధంలో వుంచారని, తరువాతి రోజు చేతులకు బేడీలు వేసి కోర్టు ముందు హాజరుపరిచారని కెకెఇ పేర్కొంది.